గాడిద బాధ
(బాధ నాదికాదు- గాడిదదే)
“కూసే గాడిదొచ్చి మేసేగాడిదని చెడగొట్టింది”ఇది గాడిదజాతికి అప్రతిష్టతెచ్చిపెట్టింది; పాపం గాడిదలు చేసే చాకిరీ అంతాఇంతా కాదు, మనమే అంటాం“గాడిద చాకిరి చేస్తున్నా, గాడిద చాకిరీ చేయించుకుంటున్నారు” అని.దానర్ధం గాడిద అడ్డమైన చాకిరీ చేస్తోందనేగా-ఎవరికీ, మనకేగా- మరి మనుషుల్ని “అడ్డగాడిద, నిలువు గాడిదా” అని గాడిద పేరుతో ఎందుకు తిడ్తుంటాం- “గాడిద బరువు మోస్తున్నాం”-అంటే అది భరించరాని బరువులు మోస్తుందనేగా దానర్థం.
అసలు“కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టింది” అన్నదానికి సరి అయిన అర్ధం వేరు-ఎవరో కవిగారో, పెద్దమనిషో ఈ నానుడి పుట్టించి ఉంటారు.అసలు మేసేగాడిద దగ్గరకొచ్చి కూసేగాడిద ఏం కూసిందో, ఎందుకు కూసిందో ఎవరైనా రీసెర్చ్ చేశారా. “అదే పనిగా తింటే వంటికి మంచిదికాదని, అనారోగ్యం చేస్తుందని దాని కూతతో మేసేగాడిదకు చెప్పటానికి” వచ్చింది.దాన్ని ఎవడోచూసి సొంత ఊహాగానం చేసి ఇలా గాడిదల్ని ఆనాటికాలంలోనే అపఖ్యాతిపాలు చేశారు.
నాకు ఈ విషయం ఎలా తెలిసింది అనుకుంటున్నారా-ఆ రోజుల్లో పుట్టిన ఓకవి గారే నాతో వాపోయారు ఈ నిజాన్ని చెప్పి-అప్పట్లోనే.అయన ఎవరికీ చెప్పినా, “ఆ.... పోదూ- నువ్వూ, నీగాడిద మాటలూనూ” అంటూ ఆయన మాటలు కొట్టి పారేసేవారట- దానికి కూడా కొద్దిగా దుఃఖపడ్డాడు నాతో-నే చిన్నపిల్లాణ్ణి అయినా కూడా-చెప్పొద్దూ, నాకు ఏడవాలనిపించింది- నా ఏడుపు చూసి దడుచుకుని ఆయన కూడా ఏడుస్తాడేమని నిమ్మళించుకున్నా!
నేనీవిషయం మా మాస్టారుగారితో అప్పుడే చెబుదాం అనుకున్నా కూడా- కానైతే- విషయం విని నన్నెక్కడ “అడ్డ గాడిదా” అంటారేమే అని ధైర్యం చేయలేదు.ఎందుకో హఠాత్తుగా ఈ విషయం గుర్తుకు వచ్చింది-ఉగ్గబట్టుకోలేక మీకు ఇప్పుడు చెబుతున్నా, ఇన్నేళ్ళనుంచి నాలోనే ఉండిపోయిన ఈ విషయం మీ చెవిన వేసానుగా, ఇప్పుడు ఖులాసాగా, నిమ్మళంగా ఉంది.
ఎక్కడైనా గాడిదని చెడ్డదనిగాని, పనిచేయని బద్దకస్తురాలని,లేదా ఇంకేమైనా చెడ్డ పనులు చేస్తుందని విన్నామా, పోనీ ఎక్కడన్నా చదివామా!
స్కూల్ లో ఆవుమీద వ్యాసం రాయమని అనేవారు గానీ, ఏఒక్క తెలుగుమాష్టారైనా చొరవ తీసుకుని గాడిద గురించి వ్యాసం రాయమని పిల్లల్ని అడిగారా! పైపెచ్చు అదే మాస్టారు- “అడ్డగాడిదల్లారా” అని పిల్లల్నితిడుతుండేవారు.అదీ కాకుండా- పిల్లలకి ఏదైనా అసైన్ మెంట్ ఇచ్చినప్పుడు ఆ క్లాస్ రూమ్ లో ఉన్నఅంతమంది పుస్తకాలు అయన రూమ్ కి తీసుకెళ్లేవారు,దిద్దటానికి.అదిగో అప్పుడుకూడా ఆ బరువుకి అదే మాస్టారు అనేవారు “యాభైమంది గాడిదల బరువు ఇది” అని.
అసలు ఇవన్నీ ఎందుకు, మన చిన్నతనంలో ఆవుతో బాటుగా గాడిదమీద వ్యాసం రాయించి ఉంటే- మనల్ని గాడిదతో పోలుస్తూ తిట్లు ఉండేవి కాదు- వాటికి సమాజంలో మంచిపేరు కూడా వచ్చిఉండేది ఈ పాటికి.ఇప్పటికీ గాడిదలు దాదాపుగా కనుమరుగయినా కూడా - దాన్ని పోలుస్తూ ఏదో నాలుగు మాటలు అంటూనే ఉన్నాం కూడా.
ఇదీ అసలు విషయం అన్నమాట!